తూర్పు గోదావరి జిల్లాలోని నడిపూడి అనే గ్రామంలో కళా శరభయ్య గారు, లక్ష్మికాంతమ్మ గార్ల రెండో కూతురు భాస్కరమ్మ గారు. ఈమె 1827వ సం॥ అక్టోబర్ 23న దసరా పండుగలలో దుర్గాష్టమి రోజు జన్మించారు.
తన ఆరు ఏళ్ళ వయసులో తల్లిని కోల్పోయి, తనకన్నా చిన్న వాళ్ళయిన ఒక తమ్ముణ్ణి, చెల్లెల్ని చూసుకుంటూ ఐదో తరగతి దాకా చదువు కొనసాగించిన అమ్మకి చదవాలని ఎంత ఆసక్తి వున్నా, ఆ ఊర్లో ఇంక లేకపోవడంతో తర్వాత రెండో సంవత్సరం కూడా అదే స్కూలుకు వెళ్తు`అదే ఐదో తరగతి గదిలోనే తన చదువు కొనసాగించింది. అలిసిపోయిన టీచరు భాస్కరం నువ్వు చెప్పవే అనడం కోసం ఎదురు చూసి చూసి ` అన్న మరుక్షణం నుంచీ తనే టీచర్ అయిపోయేదట. అమరకోశం, అప్పకవీయం అలా అమ్మకి నాలుక మీదకొచ్చాయి. మా తాతగారు కళా శరభయ్య గారు ఆపుకారీశాఖలో ఉన్నత పదవిలో వుండి తరచు ఉద్యోగ రీత్యా ఉన్నత పదవిలో వుండి తరచు ఉద్యోగ రీత్యా కాంపులకి వెళ్ళెవారు. ఓ రోజు అలా వస్తూంటే ఆయన జీపుకి అడ్డంగా ఓ చిన్న లేడి పిల్ల దూసుకొచ్చిందట. ఆయన ఆ లేడిని జీవులో వేసుకుని ఇంటికి తీసుకువచ్చారు. తల్లి లేని పిల్లలు కాస్త ఆడుకుంటారు ఆదమరుపుగా అనుకున్నారట. ఇంక చెప్పేదేముంది మా అమ్మ ఆ లేడిని ఎత్తుకునే స్కూలుకి వెళ్ళేదట. రాను రాను దాన్ని తరగతి గదిలోకి తేనివ్వకపోతే బయట కంచకి కట్టేసేవారట. స్కూలు బెల్లు కొట్టి కొట్టంగానే అది ఒక్క పరుగున స్కూలుకి వచ్చేసేదట. ఇలా మా అమ్మ ఆ లేడి కబుర్లు బోలెడు చెప్పెది. 11వ ఏట అమ్మ పెళ్లైంది. కాకినాడవాసి దర్భా వెంకయ్య గారనే గొప్ప లాయర్ గారి మÖడో కుమారుడైన శివకామునితో (శివకామ సుబ్రహ్మణ్యశాస్త్రి) వివాహమైంది. పెద్ద మనిషైన తరువాత కాపురానికి తీసుకువెళ్ళారు. వెంటనే గర్భం. పదమÖడో ఏట తొలి కాన్పు గండమైంది. బిడ్డ అడ్డం తిరిగింది. గుఱ్ఱపువాతం వచ్చి బతకదనుకుని బైట అరుగుల మీద పడుకోపెట్టేశారట. అమ్మె చెప్పింది. “అమ్మా భయమెయ్యలేదా” అంటే నా ఒంటి మీద తెలివి వుంటేగా అని నవ్వేసింది. నేను భయపడితే దగ్గరకి తీసుకుని తలనిమురుతూ ‘ఆ తర్వాత ఏడుగుర్ని కనాల్సి వుంటే అప్ప్పుడే ఏమౌతాను” అని నవ్వేసింది. అమ్మని ఎన్నో దశలలో నా 5వ ఏట నుంచి చూస్తున్నాను. బహు కష్టుజీవి. మా చిన్న చెల్లిని ప్రసవించి, పక్కన ఆ బుల్లి పిల్లనేసుకుని పడుక్కుని వుంటే `మంచాన్ని తాకకుండా తొంగి చూసిరావడం గుర్తుంది. అది ఆమెకు ఎనిమిదవ కాన్పు. కష్టజీవి అన్నాను కదూ! కానీ ఎప్ప్పుడూ వాటిని కష్టాలు అనుకోక పోవడమే ఆమె గొప్పతనం.
చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న గారు నాటకాలలో పద్యాలు రాగయుక్తంగా పాడడం వింటూ ఎదిగిన ఆమె ఆ బాణీలలో పద్యాలు రాస్తు వుండేది. రాగం ఒక్కటే కాకుండా ఆ మాత్రల వరుసతో పాటు, యతిప్రాసలని గూడా పట్టుకో గలగడమే ఆమె విజయానికి కారణమైంది. ఓ సారి తన మేనమామ అమ్మ రాసిన కంద పద్యాలు చూసి భయపడిపోయి ` బాగా దండించాడట. అసలు కందం అంటే తెలుసా? ఎన్ని గణాలో తెలుసా? దానికెన్ని నియమాల్లో తెలుసా? జగణం ఎక్కడ రావాలో ఎక్కడ రాకూడదో తెలుసా? జగణం నెత్తణుస్తుంది. ఇంటిల్లిపాదిమి చభూరుకుంటాం నీ పిచ్చిరాతలు కట్టిపెట్టు అని దులిపేశాడట. మా అమ్మ ‘కామోసు’ అనుకుని మరి పద్యం ముట్టలేదు. కొన్నిరోజుల పాటు ఏదో కథలు కాకరకాయలు రాసుకునేదట. మేం 1960 నుంచి 69 దాకా గుంటూరులో వుండేవాళ్ళం. ఓ సారి 1962`63లలో అనుకుంటా మా పిన్ని కొడుకు సూరిగాడి నోడ్సు దొరికింది. దొరికిందే తడవుగా బుక్కు వెనక్కి తిప్పి నలుడి కథ తల్చుకుంటు పాడుకుంటూ పద్యాలు అల్లేసుకుంది.
ఆనక ఆ తెలుగు నోట్సు వాళ్ళ తెలుగు మాస్టారికంట బడి నిలదీసి అమ్మ గురించి విని, 25 ఏళ్ళ సర్వీసులో వేలమందికి ఛందస్సు నేర్పాను. ఒక్క శుంఠా పద్యం రాసిన పాపాన పోలేదు. నేను ఆమెని చూడాలి ఆ అపర సరస్వతి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు అని పర్మిషన్ పెట్టి సురేషుని తీసుకుని ఇంటికి వచ్చారు. అమ్మని మెచ్చుకుని ఆ పద్యాలు ప్రచురించమని ప్రోత్సహించారు. తాను గురువుగా నిలబడి సులక్షణ సారం, అప్పకవీయం తెలుగు పంచ కావ్యాలలో ఒక్కో ఆశ్వాసం పాఠం చెప్పి సహజ కవయిత్రి అయిన అమ్మకి ఛందో అలంకార శాస్త్రాల సారాన్ని బోధించి అమ్మజ్ఞన తృష్ణని తీర్చారు. అమ్మసాన పట్టిన వజ్రంలా ఎత్తిన కలం దించకుండా 1964లో ఉత్తర నైషధంతో ప్రారంభించి హర్షవాణి, సతీ హైమావతి అనే మరి రెండు కావ్యాలు ప్రచురించారు. రామచంద్రజీ మీద భక్తి ప్రపత్తులతో 30కి పైగా గీతాలు రచించారు. ఈ తరం రచయిత్రులకు అమ్మను పరిచయం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. (తరువాత నాన్న నాగార్జున సాగర్‌కి రావడంతో పద్యాల నడక వెనకపట్టి నృత్య గేయ రూపకాల రచనానుకూల వాతావరణం అక్కడ పొందగలిగారు. రంగనాధ రంగశాలలో సాగిన ఆ నృత్య నాటకాల ప్రదర్శనలు అమ్మలో నిద్రాణంగా వున్న ఇతర కళలకు, సంగీత, నృత్య, అభినయాలకు వేదిక నిచ్చాయి. “అందుకే నాటకాంతం సాహిత్యం” అంటారేమో). నిజానికి గూంటూరులో వున్న రోజుల్లోనే అమ్మ కథలు ప్రారంభించింది. అదీ పద్యరచనతో పాటే కావచ్చు ప్రారంభం తెలీదు కానీ 1963`64 నుంచి అమ్మ కథలు వారపత్రికలలో వచ్చేవి. బాపు బొమ్మలతో అమ్మ కథలు చూసుకోడం మా ఫ్రెండ్స్‌కీ మా టీచర్లకీ చూపించడం ఎంత సంబరమో ఆ రోజుల్లోనే బాపు గారి చిత్రకళా ప్రదర్శన జింభాన గ్రౌండ్స్‌లో జరిగినట్టు జ్ఞాపకం. ఆ ప్రదర్శనలో మా అమ్మ కథ “చిరునవ్వు మెరిసింది”కి బాపుగారు వేసిన బొమ్మ కూడా వుంది అంటే మేమంతా వెళ్ళి చూసి వచ్చాం. అలాగే అమ్మకి దీపావళి కథల పోటీలో బహుమతి వచ్చినప్ప్పుడు మా సంబరానికి అంతే లేదు.
ఆ రోజుల్లోనే నాన్న ఆర్మీలో వున్నప్ప్పుడు అక్కడి విశేషాలతో రాసిన ఉత్తరాలని జ్ఞాపకం చేసుకుంటూ ‘పునర్నవం’ నవల రాసింది. ఉత్తరాలతో నడిచిన నవలలో అదే మొదటిది అనుకుంటా. చదువుకున్న కమల కన్నా ముందే ‘సైనిక సమాచార’లో సీరియల్‌గా వచ్చింది. ఆ రోజుల్లో ‘శారదలేఖలు’ నుండి పొందిన స్ఫూర్తి, నాన్నగారు ఉత్తరాల ద్వారా అందించిన సమచారాం రెండు కలిసి ఈమెను నవల మొత్తం ఉత్తరాలతోనే నడిపించాలనే ప్రేరణ పొందారేమో తొలిసారి ఉత్తరాలతో నవలను నడిపిన ఘనత ఈమెకు దక్కుతుంది. ప్రతినెలా వచ్చే ఆ పత్రిక రాగానే మా నాన్న పిల్లలందరినీ చుట్టూ కూర్చో పెట్టుకుని చదివి వినిపించేవారు. చదువుతూ చదువుతూ తన అనుభవాలు చెప్తూ ఆర్మీ జీవితం గురించిన మా అనుమానాలు తీర్చేవారు. మా నాన్న క్యాంప్ నుంచి రాగానే గంటా రెండు గంటలు అలా ఇంటిడు మందినీ కూర్చోపెట్టుకుని తన అనుభవాలు చెప్తూంటే వినడం ఎంత బాగుండేదో. మాతో పాటు మా పిన్ని పిల్లలు నలుగురు (ఆకెళ్ళ రామచంద్రమÖర్తి, సూర్యనారాయణ మÖర్తి, నాగేంద్రబాబు, లక్ష్మి) కూడా జత కలిసేవారు. ఇంకొన్ని సార్లు మా అన్న క్లాస్మేట్స్ వల్లభనేని మధుసూధన్, భమిడిపాటి రాం గోపాలం, మా పెద్దన్న ప్రసాదు కూడా జత కలిసేవారు. అదో విక్రమార్కుని గద్దె ` నాన్న శకుంతల గురించి, కాదంబరి గురించి, భవభూతి గురించి, కాళిదాసు గురించి ఏదో ఒకటి చెప్తూ వుండేవారు. మా అమ్మ జ్ఞాన సేకరణ మార్గాలలో ఇదొకటి. మౌనంగా అక్కడక్కడే తిరుగుతూనో అలసిపోయి ఓ మÖల ఒదిగి, తనూ వింటూ, ఏదో అందిస్తూ వుండేది.
నాన్న చీర కొనుక్కోమని అమ్మకి పుట్టిన రోజుకి రూ.100/`లు ఇస్తే `చీరలకేం ఎన్ని కొన్నా సంతృప్తి ఏం వుంటుంది. నాకు కవిత్వంటే ఇష్టం కనుక నా సహ రచయితకి అభినందన పూర్వకంగా ఇస్తాను అంటూ తన పుట్టిన రోజుకి ఒక పుస్తకావిష్కరణ సభ పెట్టుకొని, ఒక కవికి రూ.100/`లు బహుమతిగా ఇచ్చింది. మేం 1972`82 దాకా కావలిలో వున్నాం. అమ్మ కవిత్వం చూసి మెచ్చుకుని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రీ గారు అమ్మ కావ్యాలు అకాడమీ పురస్కారాలకి పంపడం ` అమ్మకి 1974`75వ సంవత్సం కవిత్వ విభాగంలో హర్షవాణికి ఆంధ్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. రూ.1000/`ల నగదు పురస్కారం, హైదరాబాదు వచ్చి తీసుకుని అక్కడే ఐదుగురు కూతుళ్ళకీ తలో చీరా కొనుక్కుని ఇంటికి వచ్చింది. అది తల్లి ప్రేమ మొదట విగ్రహారాధకురాలు అయినా తరువాత నాన్నతో పాటు సహజమార్గ్ ద్యానమార్గంలో కొనసాగింది.
అమ్మవాళ్ళు 82 నుంచి 92 దాకా కాకినాడలో వున్నారు. ఇంకెక్కడికీ మారమే అంటూనే ‘94లో మరోసారి మారారు హైదరాబాదు. అక్కడకు వచ్చాక అమ్మ రచనా వ్యాసంగం మళ్ళీ చురుకుగా మారింది. కళ్యాణ రాఘ’ం, కావ్యానికురుంబం ప్రచురించింది. మిసిమివాక అనే చారిత్రిక నవల నాన్నతో చర్చించడం విక్రమార్కుని చరిత్రలో లుప్త చరిత్రకి లోప పూరణంగా రాస్తున్నానమ్మా అని చెప్సేది. మా నాన్న పెద్ద పెద్ద చరిత్ర పుస్తకాలు ముందేసుకుని ఇంగ్లీష్‌లో చదివి మళ్ళా తెలుగులో అమ్మకి చెప్తూంటే అమ్మ ఆ చరిత్ర ఘట్టాలు అన్నీ రాసుకుని కథని నాన్నతో చర్చించి ప్రణాళిక రాసుకుని `తర్వాత రాసింది. అమ్మ మొదటి నుంచి ఒక ధారగా చెప్తూ వుంటే ఎవరు ఖాళీగా వుంటే వాళ్ళం రాసి పెట్టేవాళ్ళం పద్యాలు మాత్రం మా పిన్ని కొడుకు సురేషు రాసేవాడు. ఈ నవల నేను, మా పెద్ద చెల్లి, సురేషు రాశాం. దురదృష్టం ఆ నవల దొరకలేదు. అలాగే ‘శ్యామభట్టు’ అనే ప్రబంధం రాసింది. దానిలో కథా నాయకుడు కవి. ప్రబంధ లక్షణాలలో ప్రసిద్ధుడే కథా నాయకుడుగా వుండాలన్న నియమాన్ని ఉద్ధేశపూర్వకంగా పక్కనపెట్టి ఏం ఒక సామాన్యమైన కవి కథా నాయకుడుగా తగడా, పండితులు ఒప్పకపోతే పోనీ, నేనీ నియమోల్లంఘన చేసి, స్వతంత్ర ప్రబంధం రాస్తాను అనేది. అలాగే రాసింది. అదీ ఇంకా అముద్రితం. “యజ్ఞసేని” అని ద్రౌపతి జన్మ వృత్తాంతాల ఆధారంగా రాసిన కావ్యాన్ని నేను ప్రచురించాను. అలాగే అమ్మరాసిన
“ఉత్తరదేశయాత్ర”, నృత్య నాటికలు రాతప్రతుల నుంచి సేకరించి అవి కూడా ముద్రించాను. అలాగే అమ్మ సైనిక్ సమాచార్‌లో సీరియల్‌గా రాసిన మిసిమివాక ` కొన్ని కథలు కలిపి ఒక పుస్తకంగా ముద్రించగలిగాను. ఇంకా ఆమె భక్తి గీతాలు, సహజమార్గ్ వ్యాసాలు, కొన్ని శతకాలు, కొన్ని పొడుపు కథలు, నాన్నగారి స్వీయచరిత్ర అముద్రితాలుగా మిగిలాయి. అమ్మ స్త్రీల సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, కుటుంబ సంబంధాల మీద, స్త్రీ పురుష మైత్రీ మీద, పిల్లల పెంపకం మీద నిర్థిష్టమైన అభిప్రాయాలతో చక్కటి పరిష్కారం సూచించే రచనలు ఆ కాలంలోనే రాయగలగడం అబ్బుర పరిచే విషయం.
