ఆధ్యాత్మికత, ప్రకృతి ప్రేమల కలనేత దర్భా భాస్కరమ్మ గారు రచించిన ‘నా ఉత్తర దేశ యాత్ర’ – సింగరాజు రమాదేవి

సాహిత్య ప్రక్రియలలో యాత్రా సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. యాత్రా సాహిత్యం మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ప్రాంతాలని, ప్రసిద్ధ క్షేత్రాలని, దర్శనీయ స్థలాలని పరిచయం చేస్తుంది. తెలుగులో యాత్ర సాహిత్యంలో మొదటి యాత్రా గ్రంథంగా ప్రసిద్ధి పొందినది ఏనుగుల వీరాస్వామి 1838లో రాసిన ‘కాశీయాత్ర చరిత్ర’. ఇది ఆ కాలపు భారతదేశ సామాజిక సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఒక ప్రామాణిక చారిత్రిక ఆధారంగా నిలుస్తుంది.

స్త్రీల యాత్రా సాహిత్యం: ఇక స్త్రీలు రాసిన యాత్రా సాహిత్యం చూస్తే, 1874లో పోతంశెట్టి జానకమ్మ ‘శ్రీ ఆంధ్రభాషా సంజీవని’ పత్రికలో తన యూరోప్ అనుభవాలు రాసింది. ఆ తర్వాత ఇది ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ’ పుస్తకంగా ప్రచురితమైంది. 1873- 74లో పోతంశెట్టి జానకమ్మ తన భర్త రాఘవయ్యతో కలిసి యూరోప్‌లో పర్యటించారు. ఈ పర్యటన అనుభవాలను ఆమె రాశారు. దానిని మహిళలు చేసిన తొలి ఆధునిక రచనగా గుర్తించవచ్చు అంటారు కాత్యాయని విద్మహే తన ‘తొలి అడుగులు’ పుస్తకంలో.
1900 సంవత్సరంలో గుండు అచ్చమాంబ రచన ‘రామేశ్వర యాత్ర చరిత్ర‘ అని ‘సరస్వతి’ పత్రికలో వరుసగా కొన్ని నెలలు ప్రచురింపబడింది. 1895లో వేసవికాలంలో ఆమె చేసిన రామేశ్వర యాత్ర అనుభవాల కథనంగా వచ్చిన పద్య రచన, రామేశ్వర యాత్ర చరిత్ర అని తెలుస్తుంది. ఇందులో 318 పద్యాలున్నాయి. మహిళా యాత్రికుల అనుభవాలను క్రోడీకరిస్తూ స్వర్ణ కిలారి ఇటీవల వెలువరించిన ‘ఇంతియానం’ ఒకటి, రెండు సంకలనాలు కూడా యాత్ర సాహిత్యంలో ముఖ్యమైనవి.
ఇక ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్న పుస్తకము, దర్భా భాస్కరమ్మ గారు రచించిన ‘నా ఉత్తర దేశ యాత్ర’ అనే పుస్తకం! ఈ యాత్ర ఆమె 1988లో చేయగా ఈ పుస్తకం మాత్రం 2012లో జయంతి పబ్లికేషన్స్ ద్వారా దర్భా భాస్కరమ్మ గారే రచించిన ‘పౌరాణిక నృత్య నాటికలతో’ కలిపి ప్రచురితం అయింది. ఈ పుస్తకాన్ని ఆమె తన జీవన సహచరుడు శ్రీ శివకామ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అంకితం ఇచ్చారు. దీనికి ‘ఆత్మీయ స్పందన’ అనే ముందుమాట ఆమె కుమార్తె అయిన డాక్టర్ డి. లక్ష్మీ సుహాసిని గారు రాశారు. దర్భ భాస్కరమ్మ గారు ఈ ఉత్తరదేశ యాత్ర కాక మూడు సార్లు అమెరికా ప్రయాణాలు చేశారు. అలాగే ‘సహజమార్గం ప్రిసెప్టర’గా షాజహాన్ పూర్ యాత్రలు చేశారు. ఆ యాత్ర కథనాలు ఇంకా అముద్రితాలుగా ఉన్నాయి. వాటిని వీలు వెంబడి ప్రచురిస్తాం అని కూడా డాక్టర్ లక్ష్మీ సుహాసిని తన ముందుమాటలో చెప్పారు.
యాత్రా స్పెషల్స్, ప్యాకేజీ యాత్రల నేపథ్యం : 80వ దశకంలో యాత్ర నిర్వహణలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. అంతవరకు స్థానికంగా ఉన్న ప్రైవేటు టూర్ ఆపరేటర్లు మాత్రమే యాత్రల ఏర్పాటు చేసేవాళ్లు. అయితే 80ల నుండి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీ టూర్లు నిర్వహించటం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా మరియు కేంద్రం పరిధిలోని రైల్వేల ద్వారా పెద్ద ఎత్తున ఈ యాత్రలకు ప్రచారం కల్పిస్తూ చవక ధరలలో ఈ యాత్రా స్థలాలను సందర్శించే వీలుని ప్రభుత్వాలు కల్పించాయి, దీని ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు తీర్థయాత్రలకు వెళ్లే వెసులుబాటు కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఇస్కాన్ వంటి సంస్థలు కూడా ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు మొదలుపెట్టారు. ప్రసిద్ధ పుణ్యస్థలాలతోపాటు అంతగా ప్రాచుర్యం పొందని కొంచెం దూరప్రాంతాల్లో ఉన్న ఆలయాలతో కలిపి టూర్ ప్యాకేజీగా ఏర్పాటు చేసేవారు.
యాత్ర స్పెషల్ పేరిట ప్రముఖ దేవాలయాలకు ఒక బృందంగా యాత్రను ఏర్పాటు చేయటము, రైలు టికెట్లు, బస్ టికెట్లు మొదలుకొని ఆ దర్శనీయ స్థలాల్లో ఉండేందుకు సత్రాలు, హోటల్స్ వంటి వసతులు కల్పిస్తూ బృందయాత్రలను నిర్వహించే ట్రావెల్స్ కంపెనీలు చాలా మొదలయ్యాయి. చార్ ధామ్ యాత్ర, కాశీ-గయ-ప్రయాగ యాత్రలు, ఇలా ఉత్తర భారత దేశ యాత్ర, దక్షిణ భారతదేశ యాత్ర వంటివి వారు ఆర్గనైజ్ చేస్తూ ఉండేవారు. ఇక రైల్వే వారు కూడా 101 రూపాయల ఒక సర్కులర్ టికెట్ అప్పట్లో ఇచ్చేవారు. ఈ టికెట్ మీద ఒక నెల రోజుల పాటు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఏ రైలు అయినా ఎక్కి ప్రయాణించే వెసులుబాటు ఉండేది. కుటుంబంతో విడిగా కానీ లేదా ఒక బృందంగా గాని ఈ యాత్రలు చేసే వీలు ఉండేది. ప్రయాణ ఏర్పాట్లు అన్ని టూర్ ఆపరేటర్లే చూసుకుంటారు కనుక యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక లేకపోయినా సౌకర్యంగా ఆ యాత్ర పూర్తి చేసుకునే వీలు కలిగేది. అటువంటి ఒకానొక టూర్ ప్యాకేజీలోనే దర్భా భాస్కరమ్మ గారు బృందంగా యాత్రలకు వెళ్లారు అని అనిపిస్తుంది.
ఈ ఉత్తరదేశ యాత్ర 1988 మే రెండవ తారీకు సోమవారంన నిడదవోలు నుండి ‘శారదాయాత్రా స్పెషల’లో ఒక 80 మంది యాత్రికులు కలిసి మొదలుపెట్టిన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒరిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయంతో మొదలుపెట్టి భువనేష్వర్, కలకత్తా, గయా, కశ్మీర్‌లో శ్రీనగర్, జమ్ము, ఆపై నేపాల్‌లో ఖాట్మండు, తిరిగి కాశీ, ప్రయాగ, సారనాథ్, అటు నుండి హరిద్వార్, ఋషికేష్, కేదారనాథ్, బదరీనాథ్, ప్రయాగ, ఇంకా ఢిల్లీ, ఆగ్రా, మథురా, షిర్డీ, బాంబే, షోలాపుర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలు అన్నీ దర్శిస్తారు.
జూన్ 10వ తారీకు 1988 రోజున యాత్ర ముగిసింది. నెల పైన 8 రోజులు అంటే దాదాపు 38 రోజులు పైగా చేసిన ఈ ఉత్తర భారత దేశ యాత్రలో ముఖ్యమైన స్థలాలు చాలా మటుకు దర్శించారు.
ముఖ్యంగా ఈ యాత్ర కథనంలో నేను గమనించినది ఆయా స్థలాలు చూడటానికి వారు చూపిన ఉత్సాహం. అక్కడి స్థల పురాణాలు, ఆ చారిత్రిక కట్టడాల వైభవము, సాంస్కృతిక వైభవాన్ని, ఆయా ప్రాంతాల గొప్పదనాన్ని, దేవాలయాల పవిత్రత, ప్రాశస్త్యము వంటి వాటిని స్వచ్ఛమైన మనసుతో తిలకించి పులకించి ఆనందించినట్లుగా అనిపిస్తుంది. ప్రయాణంలో ఎదురైన చిన్న చిన్న ఇబ్బందులు, ప్రయాణపు అలసట, ఆహార విహారదులలో తప్పని ఆలస్యము… అసౌకర్యము వీటిని పెద్దగా లెక్కచేయకుండా, అన్నిటిని యాత్రలలో సహజమైన ఇక్కట్లుగా భావించి వాటికి అంత ప్రాధాన్యతను ఇవ్వకుండా యాత్రలో కలిగిన అనుభూతుల మీద ఎక్కువ దృష్టి పెట్టి వర్ణించినట్లుగా అనిపిస్తుంది. చాలా చోట్ల భక్తి పరవశంతో, భావోద్వేగానికి గురై ఆ ప్రకృతిని దైవాన్ని వేడుకుంటూ. ఆ ప్రకృతికి అక్కడ దేవతలకు తాము అక్కడికి వచ్చామని తమను గుర్తు చేయమని చెప్పుతూ తమ ముందు తరాలకు కూడా మోక్షం లభించాలని ముందు తరాలలో ఎవరు నాస్తికులుగా ఉండకుండా దీవించాలని ప్రార్థించడం చూస్తాం. కాశీ, గయా, ప్రయాగ వంటి చోట్ల పిండ ప్రదానం గాని, కేదారనాథ్, బదరీనాథ్ వంటి చోట్ల భగవంతుని దర్శించుకున్నప్పుడు కలిగిన భక్తి పరవశం కానీ ఇవన్నీ రచయిత్రి తాను నమ్మిన మతము, మతాచారాలు, సంస్కృతి పరమైన నమ్మకాలు వీటి వలన ఆమెకు కలిగిన అనుభూతికి గల భూమికలు.
అసలు యాత్రలు ఎందుకు చెయ్యాలి: బయట ప్రపంచాన్ని చూడటానికి, అనేక దర్శనీయ స్థలాలను చూడడానికి, ప్రపంచాన్ని తెలుసుకోవటానికి, భిన్న సంస్కృతులను, భిన్న ఆహారపు అలవాట్లను, ఇతర రాష్ట్ర ,ప్రాంత, భాష లకు చెందిన మనుషులను కలుసుకోవడానికి యాత్రలు ఉపయోగపడతాయి. అక్కడి చరిత్రను సంస్కృతిని అలవాట్లను తెలుసుకోవటం, భిన్న సంస్కృతులకు పరిచయం కావడం వలన ఒక విశాలమైన దృక్పథాన్ని అలవర్చుకోవటము, కొత్త విషయాలు తెలుసుకోవడం వలన వ్యక్తులుగా మానసికంగా భౌతికంగా బౌద్ధికంగా ఎదగటానికి కూడా తోడ్పడేవి ఈ యాత్రలు. ఇవి చెప్పుకోవటానికి ఒక ధర్మానికి, మత విశ్వాసానికి చెందినవే అయినా ఒక యాత్ర అంటూ చేసినప్పుడు అందులో మనుషులు అనేక అనుభవాలకు, అనుభూతులకు లోనవుతారు. అవి భక్తికి విశ్వాసానికి పరిమితం కాకుండా ఇంకా చాలా రకాలుగా వారు మనుషులుగా ఎదగటానికి ఉపయోగపడుతుంది.
అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆ యాత్రలో ఏదైనా ఇబ్బందిగాని అసౌకర్యంగాని ప్రమాదం గాని సంభవించినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో, కొందరిలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కొందరిలో గల చురుకుగా స్పందించే గుణం, ఇతరులకు సహాయపడే గుణం, ధైర్య సాహసాలు ఇలాంటివన్నీ కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణాలు లేని వారు వీరిని చూసి నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సామాన్యంగా ఇంట్లో గడిపే జీవితంలో ఎదురుపడని అనేక అనుభవాలు అవకాశాలు ఇలాంటి యాత్రలలో కల్పింపబడతాయి. మన రోజువారి జీవన పోరాటంలో మనకి దొరకని తీరిక, విశ్రాంతి కూడా ఈ ప్రయాణాలలో మనకి దొరికే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం నిత్య జీవనంలో పూర్తిగా పక్కన పెట్టేసిన కొన్ని లలిత కళలు అంటే పాడటము, ఆడటము (అప్పుడప్పుడు నవ్వటం కూడా) వంటి వన్నీ యాత్రలలో చేసే వీలు ఉంటుంది.
స్త్రీలకు యాత్రలు ఎందుకు అవసరం : ఒకరకంగా చూస్తే ఎప్పుడూ ఇంట్లోనే గడిపే ఆడవారికి, ఇలాంటి యాత్రలు అనేవి ఇంటి నుండి, ఇంట్లో ఉండే నిరంతరమైన శారీరక శ్రమ నుండి, ఆ ఇంటి బాధ్యతల నుండి ఒక ఆటవిడుపు లాంటివి! ముఖ్యంగా ఒక బృందంతో యాత్ర చేసేటప్పుడు తోటి వారితో కలుపుగోలుగా ఉండటము, వారితో వసతి గాని భోజనంగానీ ఇతర సదుపాయాలు కానీ కలిసి పంచుకోవటం, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవటం, తమ జీవితానుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవటం చేస్తారు. హిందూ ధర్మంలో గుడికి వెళ్ళటం దేవుని దర్శించడం, ఆ గుడిలో స్థల పురాణాలని అక్కడి ఆచారాలను బట్టి ఆయా పూజలను నిర్వహించడం, కాశీ గయా వంటి చోట పిండ ప్రదానం చేయటము ఇవన్నీ కూడా ధార్మికంగా సామాజికంగా సాంస్కృతికంగా ఆమోదింపబడ్డ కార్యాలు. అందుకని ప్రత్యేకించి ఆడవారికి సాంఘికంగా, బయట ప్రపంచంలో ఇతర కార్యకలాపాలకు అనేక నిషేధాలు నిబంధనలు ఉన్న ఆ సమయంలో, ఈ తీర్థయాత్రల విషయంలో అందరి ఆమోదము ప్రోత్సాహము రెండు లభిస్తాయి. బహుశా అందుకే ఆనాటి స్త్రీలు తమ ఆనందాలను వేడుకలను విహారయాత్రలను… పూజలు వ్రతాలు గుడులకు అనుబంధంగా అల్లుకుని వాటి చుట్టూ ఉండే కార్యక్రమాలు చేయటం ద్వారా ఏ ఆక్షేపణ లేకుండా తమ సామాజిక సంబంధాలను, సాంఘిక కార్యక్రమాలను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు అనిపిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు కూడా ఈ తీర్థయాత్రలు ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా “ఇల్లే కైలాసం… వంటిల్లే వైకుంఠం” గా బ్రతికిన ఆ తరపు స్త్రీలకు ఈ తీర్థయాత్రలు, జీవితంలో మరపురాని జ్ఞాపకాలను అనుభవాలను పోగేసుకోగలిగే ఒక ముఖ్యమైన ఘట్టంగా కూడా చెప్పవచ్చు! యాత్ర కథనంకు ముందుమాట రాసిన డాక్టర్ డి లక్ష్మీ సుహాసిని “శాస్త్రీయంగా చూసినప్పుడు సాంఘిక సామాజిక నైసర్గిక భాష సాంస్కృతిక అంశాల మొహరింపు ఈ యాత్ర కథనాలు” అంటారు. “స్థల పురాణాలను, ఐతిహ్యాలను జోడించి ఆయా దేవాలయాల్లో నిర్మాణ కౌశలం దగ్గర నుండి విగ్రహాల వర్ణన వరకు తారీకు కాలక్రమ వివరణతో వివరించి, ఆచరించే హిందూ ధర్మ విధులను విధానాలను రచయిత్రి సవివరంగా వర్ణిస్తూ రాశారు. భ్రమణకాంక్షతో విభిన్న ప్రాంతాలను తిలకించడం అలా చూడడంలో నైసర్గికంగా అవలంబించిన క్రమం తాను పొందిన అనుభూతులు తన భాషలో భద్రపరిచే ప్రయత్నం గా క్లుప్తంగా ఈ కథనాలను రాశారు” అంటారు. దర్భా భాస్కరమ్మ గారు నిడదవోలు నుండి ‘శారదా యాత్ర స్పెషల’ లో ఒక 80 మంది యాత్రికులతో కలిసి ఈ ఉత్తరదేశ యాత్రకు బయలుదేరారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే “ఒకే కుటుంబం లాగా ప్రేమాభిమానాలతో ఒకరినొకరు పలకరించుకుంటూ, వరసలు కలుపుకుంటూ, ఆనందాలు మేళవించి ప్రియభాషణలు చేస్తూ, ఉపహారాలు భోజనాలు చవులు చూస్తూ ఆరగిస్తూ సాగించాము” అంటారు తమ ప్రయాణాన్ని. ముందే చెప్పుకున్నట్టు భాస్కరమ్మ గారు తాను దర్శించిన ఆలయాలలో పద్ధతులు, ఆచారాలు, స్థల పురాణాలను నమ్మకాలను సవివరంగా రాశారు. ఉదాహరణకు పూరి జగన్నాథ ఆలయంలో, 365 కుండలలో అన్నం వండి 365 అర్చకులు అర్చన చేస్తారు! 365 మంది కుమ్మరులకు ఈ కుండలు చేసి ఇవ్వడమే వారి పని. ఈ అన్నం వండేటప్పుడు ఏడు కుండలు వరుసగా ఒక దానిపై ఒకటి పెట్టి వండి దేవుడికి నైవేద్యం పెడతారు” అని చెప్తారు. ఇక కోణార్క్‌లోని సూర్యదేవాలయం అసంపూర్ణంగా శిథిలావస్థలో ఉండడం వెనుక ఉన్న చరిత్ర వివరించి బాధపడతారు. భువనేశ్వర్ నుండి హౌరాకి వెళ్లే దారిలో ఆ రాత్రి రైలు ప్రయాణాన్ని ప్రకృతిని చక్కగా వర్ణిస్తారు. భర్త, బంధువులతో కలిసి వెళ్ళిన ఈ యాత్రలో తన చిన్నకూతురు డాక్టర్ వాణి తీసుకెళ్లి దగ్గరుండి అన్నీ చూపించింది అని కూడా చెప్తారు. కలకత్తాలో చూసిన రామకృష్ణ మందిరం, వివేకానంద స్వామి మందిరం, శారదా మాత మందిరం, జ్యోతిర్లింగాలు, విక్టోరియా మెమోరియల్, ప్లానెటేరియం, కాళీమాత ఆలయం ఇవన్నీ వివరిస్తారు. బుద్ధగయలోని బౌద్ధాలయాలు, బుద్ధ దేవుని ప్రతిమలు, బోధి వృక్షం కింద జ్ఞానోదయం అవటం, కుడ్య చిత్రాలు వీటన్నిటి గురించి కూడా రాస్తారు. ఫల్గుణి నదిలో పిండ ప్రదానం చేయటము వివరిస్తారు.
ఇక కొండ మార్గంలో రెండు రోజులపాటు ఘాట్ రోడ్లో ప్రయాణించి ‘నారాయణఘాట’ చేరుకోటము, ఆ తర్వాత నేపాల్ ముఖ్య పట్టణమైన ఖాట్మండు చేరినట్లుగా చెప్తారు. అక్కడ పశుపతినాధుని మందిరము, భాగమతి నదిలో స్నానము, కాలభైరవుని ఆలయం వీటన్నిటి గురించి వివరిస్తారు. “అక్కడ ‘గుహ్యేశ్వరీమాత’ గా నెలకొన్న పార్వతి దర్శించి భక్తి భావంతో కన్నులు చెమ్మగిల్లాయి” అని రాసుకుంటారు. ప్రత్యేకించి ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు “అమ్మా భూమాతా నీకోసం కోట్ల సంతానమైన మేము వచ్చామమ్మా! ఈ కొండల వరుసలు, ఈ మహోన్నత వృక్ష రాజాలు, లోయలు వాగులు, ఇంతటి ప్రకృతి సంపద ఇన్నాళ్లు ఎందుకు చూడలేదమ్మా? ఈ అడవి తల్లి ఒడిలో ఆప్యాయంగా స్వల్ప కాలమైనా ఉండగలగడం మా అదృష్టం అమ్మా! అని అనుకున్నాం” అంటారు.
“ఆ నిశ్శబ్దంలో తపస్సు చేసుకునే సాలవృక్షములారా మాకు సెలవిస్తారా? చిన్న చిన్న చెట్లు బడి పిల్లల లాగా వరుసగా నిలబడి మాకు వీడ్కోలు చెబుతున్నాయి. మహోన్నతమైన వృక్షాలను తల ఎత్తి చూస్తూ చెమ్మగిల్లిన కన్నులతో మేము వీడ్కోలు అడిగాము” అంటారు. “ఈ గాలి నీరు ఈ పర్వతశ్రేణులు 1000 సంవత్సరాలు ఇక్కడే సాక్షి భూతంగా నిలబడతారు. మేము మర్త్యులం! మాకు మరణం తథ్యం! మేము దేవుని సేవించుకున్నామని సంధ్యా నాట్యం ముగించుకుని ఎప్పుడైనా మహేశ్వరితో ఆ పశుపతి నాథుడు ఇక్కడికి వస్తే మేము వచ్చి దర్శనం చేసుకుని వెళ్లిన బిడ్డలం… అని జ్ఞాపకం చేయరూ. మా వంశీయులకు కూడా తనను దర్శన భాగ్యం ప్రసాదించమని అడగండి. వాళ్లలో నాస్తిక వాదం విచ్ఛిన్నమయ్యేలా వరము అడగండి” అని మనసులో అనుకొని కళ్ళనుండి ఆనంద భాష్పాలు వర్షించగా తిరిగి బయలుదేరతారు. రచయత్రిలోని భావుకతకు, భక్తి పారవశ్యానికి అద్దం పట్టే ఇలాటి మాటలు ఈ కథనం నిండా ఎన్నో ఉన్నాయి!
మరొకచోట బస్సుకి బ్రేకులు ఫెయిల్ అవ్వటం అందులో ఉన్న 40 మంది ప్రయాణికులను దించేసి ఆ బస్సు ఆపేయడం జరుగుతుంది. వారిని వీరు ప్రయాణిస్తున్న బస్సులోకి అదనంగా ఎక్కిస్తారు. అయిష్టంగా నైనా సరే “ఈ అడవిలో వీరంతా చిక్కుబడిపోతే ఎలా” అన్న భావనతో తోబుట్టువులు లాగా ఆ చెల్లెళ్లు తల్లులు బిడ్డలను ఎక్కించుకుని తాము జరిగి ఇరుక్కొని మరీ, వారికి సీట్లు ఇచ్చి మొత్తానికి ఆ ప్రయాణం కొనసాగిస్తారు. ఆ సమయంలో కొంచెం అసౌకర్యం కలిగినా, తోటి వారికి సాయం చేయగలిగామన్న తృప్తి, ఆ భగవంతుడు ఈ భాగ్యం కల్పించాడు అన్న ఆనందంతో ఆ అసౌకర్యాన్ని అధిగమిస్తారు.
తమ సీటుని ఇద్దరు ఆడపడుచులకి త్యాగం చేసి 150 మైళ్ళ దూరాన్ని తన భర్త తన అన్నగారు నిల్చుని ప్రయాణించటం గమనించి… “తమ కార్యంబు పరిత్యజించియు, పరహితార్థ వ్యాపకుల్ ఉత్తముల” అనే భర్తృహరి సుభాషితం గుర్తు వచ్చినట్టు రాస్తారు. కన్నులు చెమ్మగిల్లగా” ఇలాంటి ఉత్తములే లోకంలో శతసహస్ర సంఖ్యలుగా పుట్టేలా చెయ్యి” అని భగవంతుని ప్రార్థిస్తారు.
వారణాసికి చేరుకునే క్రమంలో మధ్యలో ఒక చెకింగ్ పాయింట్ వద్ద మూడు గంటల పాటు బస్సును నిలిపివేసి తమ బ్యాగులన్నిటిని తిరగమరగా వేసి చెక్ చేయడము చేతిలో మామూలు పడగానే ఆ చెకింగ్ అనేది ఆపివేయడం గురించి చెప్తూ “ఈ రకమైన లంచగొండితనం దేశమంతా ఆవరించి ఉన్నది” అని అంటారు. ఇక కాశి అనగా వారణాసి క్షేత్ర గురించిన పురాణము దాని చరిత్ర, నదులు వీటన్నిటి గురించి కూడా విస్తారంగా ప్రస్తావిస్తారు. కాశీ విశ్వనాధుని ఆలయము, కాశి అన్నపూర్ణాలయము, కాశీ విశాలాక్షి ఆలయము, దశ అశ్వమేధ ఘాటు తర్వాత అక్కడ పిండ ప్రదానాలు చేయటము అభిషేకాలు చేయడము తులసి మానస మందిరాన్ని దర్శించుకోవడం ఇవన్నీ కూడా రాస్తారు. మదన్మోహన్ మాలవ్య కట్టించిన బనారస్ హిందూ యూనివర్సిటీని కూడా దర్శిస్తారు. కాలభైరవుని ఆలయము గురించి కూడా రాస్తారు. వ్యాస కాశీ గురించి, సారనాథ్‌లో గౌతమ బుద్ధుడు తను కనుగొన్న సత్యాన్ని లోకానికి వెల్లడించడం ఒక ఐదుగురు శిష్యులకు బోధనలు చేయడం ఈ సారనాథ్ లో బోధించారని అంటారు.
గౌతమ బుద్ధుని జీవితంలో సంభవించిన అతి ముఖ్యమైన నాలుగు ఘట్టాలు అనగా జననం (కపిలవస్తు నేపాల్) జ్ఞానోదయం (బుద్ధగయ భారతదేశము) ధర్మచక్ర పరివర్తనం (సారనాథ్ భారతదేశం) మహాపరి నిర్యాణం (కుషి నగరం నేపాల్). ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్న వారందరికీ పరమ పవిత్రమైన దర్శనీయ స్థలాలు. వీటిలో రెండు, అనగా బుద్ధగయ సారనాథ్ భారత దేశంలోనే ఉండడం చాలా విశేషం అని చెప్తారు. ఇక త్రివేణి సంగమం దగ్గర స్త్రీలు ‘వేణి దానము’ అనగా జడను దానం చేయడం. “ఇక్కడ త్రివేణి అనగా మూడు నదులు కలిసి జడల అల్లుకున్నవి కనుక సౌభాగ్యదాయని అయిన ఆ నదీమ తల్లులకు స్త్రీలు తమ వేణిలో కొసభాగం దానమిచ్చి ఆశీస్సులు అందుకుంటారు” అని వేణి దానం చేసే క్రమాన్ని కూడా వివరంగా రాస్తారు. దంపతుల మధ్య అదొక వేడుకగా కూడా ఉంటుందని చెప్తారు.
తర్వాత హరిద్వార్ దర్శనము, మానసాదేవి ఆలయము, ఋషికేష వీటి గురించి వివరిస్తారు. బదరీనాథ్ గురించి చెప్తూ “పడమరలో ద్వారక, తూర్పులో పూరి, ఉత్తరంలో బదరీనాథ్, దక్షిణంలో రామేశ్వరం” ఇవి పుణ్యక్షేత్రాలుగా చెప్తారు. బదరీనాథ్ గురించిన పురాణ కథ కూడా వివరంగా ఇక్కడ రాస్తారు. తర్వాత నరనారాయణుల విగ్రహాల గురించి కూడా రాస్తారు.
కేదార్నాథ్ కృష్ణ కుండము, గౌరీ కుండము తర్వాత కేదార్నాథ్లో కొం& ƒమీదకి ఎక్కుతుంటే “ఆ ఎత్తుకు వెళ్లే కొద్దీ పక్కన లోయలు లోయలో ప్రవహించే నది, వరుసలుగా కనిపిస్తున్న మంచు కొండలు, అంతా అందమైన ప్రకృతి… ఆనందదాయకమైన ప్రయాణమే కానీ గుర్రం కాస్త లోయ అంచుకి వస్తే మాత్రం గుండె గుబ్బిల్లుమనేది! అందమైన ఆ పర్వత శ్రేణులు వంపు తిరిగే మందాకిని చూస్తూ అపూర్వమైన ఆ ప్రకృతిని దానిని సృజించిన పరమాత్మ ని స్మరించుకుంటూ ఎడతెరిపి లేని ప్రయాణం సాగించాము” అని అంటారు. ఆ ప్రయాణంలో ఎంతో మంది వృద్ధులు బాలలు, కర్రలు చేతపట్టి ప్రయాణం సాగిస్తుంటే “భగవంతుని మీద భక్తి ప్రగాఢ విశ్వాసం దీక్ష వారికా శక్తిని ప్రసాదించాయి” అని అనుకుంటారు. అంత ప్రయాసపడి లోపలికి వెళ్లి ఆ కేదార నాధుడిని చూడగానే కలిగిన భక్తి పరవశం ఇలా వర్ణిస్తారు. “తప్పిపోయిన పిల్లలు తల్లి ఒడి చేరిన తృప్తి! యుగయుగాల నిరీక్షణ ఫలించిన ఆనందం! పుట్టుక సార్ధకత సంకరించుకున్న అ నుభూతి! ఆ అపురూపమైన అనుభూతి చెదిరిపోతుందేమో అనే భయము! వ్యక్తం చేయలేని పారవశ్యం! అనుకంపనలో ఆ క్షణాలు శాశ్వతం చేసుకోవాలని అత్యాశ! అన్నీ కలిసి తమని తాము మర్చిపోయిన మయిమరుపుతో ఆ దేవదేవునికి అంజలి ఘటించాము” అని చెప్తారు. ఆపై కాశ్మీర్‌కి ప్రయాణమై “పర్వత సానువులతో నిర్మించబడిన సౌందర్య విరాజితమైన నగరం శ్రీనగర్‌కి చేరుకున్నాము. లోయలలో మెట్లు మెట్లుగా పైరులు పైరులలో నింపబడిన నీరు చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన సమున్నత వృక్ష రాజములు లోయలలో సవ్వడితో ప్రవహించే జీలం చీనాబ్ నదులు, సస్యశ్యామలమై నయనానందకరమై కన్నుల పండుగగా కల్పించే కలియుగ నందనం కాశ్మీరం” అని ఆ ప్రకృతిని చాలా రమ్యంగా వర్ణిస్తారు.
అక్కడనుండి జమ్ముతావిలో ఢిల్లీకి బయలుదేరి అక్కడ రాజ్ఘాట్, శక్తిస్థల్, శాంతివనం విజయఘాట్, ఎర్రకోట, జమా మసీదు, కుతుబ్మినార్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ వగైరాయిలు చూసి ఆగ్రా కు బయలుదేరి అక్కడ ఆగ్రా కోట, తాజ్ మహల్ చూసి అక్కడ నుండి మధురకి వెళ్లి కృష్ణ శ్రీకృష్ణ జన్మస్థానం దర్శిస్తారు. కానీ అది అంత సంతృప్తిగా అనిపించలేదు అంటారు. అక్కడి నుండి షిరిడి వెళ్లి సాయిబాబా దర్శించుకుని త్రయంబకేశ్వర్‌లో గోదావరి పుట్టిన స్థలాన్ని చూసి అక్కడి నుండి ముంబై వెళ్తారు. అప్పుడు దానిని బాంబే అనేవారు. అక్కడ ముంబాదేవి గుడిని, గేట్వే ఆఫ్ ఇండియా, ప్రిన్సెస్ వేల్స్ మ్యూజియం, మహాలక్ష్మి ఆలయం మొదలైనవన్నీ దర్శించుకుని సోలాపూర్ వెళ్లి అక్కడినుండి యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తారు.
యాత్ర కథనం మొత్తంలో రచయిత్రి దర్భా భాస్కరమ్మ గారి ప్రకృతి ప్రేమ, దైవభక్తి, మత విశ్వాశాల పట్ల వారికి ఉన్న గౌరవం, తోటి వారికి సాయపడాలన్న మంచి మనసు, ప్రకృతి ముందు తాము ఎంత అల్పులమో అన్న ఒక ఎరుక, ప్రకృతిలో పరవశమై పొందిన భావోద్వేగాలని చాలా రమ్యంగా వర్ణించి రాయటం… ఈ కథనంలో తరచూ మనకు తారసపడే అంశాలు. సాధారణంగా యాత్రికులు చాలామంది యాత్రలు చేస్తారు. వాటి గురించి తమ స్నేహితులకు బంధువులకు చెప్తారు. కానీ దర్భా భాస్కరమ్మ గారు రచయిత్రి కావడం వల్ల ఆ యాత్ర విశేషాలను ఒక కథనంగా మలచి, తేదీలు యాత్ర స్థలాలు వాటి వెనక ఉన్న పురాణాలు వాటి రమణీయత, ఒక్కొక్క యాత్ర స్థలంలో జరిగే క్రతువులు తంతులు వాటి వెనక ఉన్న విశ్వాసాలు వీటన్నిటినీ వివరిస్తూ ఒక బాధ్యతగా రాసిన రచన అని అనిపిస్తుంది. మతపరమైన, ధార్మికపరమైన అంశాల విషయంలో చాలా సార్లు, భక్తులు, విశ్వాసపరులు చరిత్రను, పురాణాలను, స్థానిక ఐతిహ్యాలను, పురాగాథలను కలగలిపి చెప్తారు. అవే విశ్వసిస్తారు. పురాణ పాత్రలు చరిత్రలో లేకపోవచ్చు. ఒకొక్కసారి వారు కావ్యాలలో పాత్రలు మాత్రమే కావచ్చు. కానీ సామాన్య ప్రజల భక్తుల మదిలో వారు నిజంగా ఉన్నట్టే భావిస్తారు. మతపరమైన ఆ విశ్వాసాలే మత ప్రదేశాల ప్రాశస్త్యాన్ని కాపాడేవి, వేడుకలను, ఊరేగింపులను మతాచారాలను ముందుకు నడిపించేవి. ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలలో కూడా ఆ నమ్మకమే కనపడుతుంది. ఆధునిక సాంకేతికత, స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వంటివి లేని ఆ కాలంలో సామాన్య ప్రజలు ఏ వివరాలకైనా, వింతలకైనా పుస్తకాలు, రేడియో ఇంకా పోతే టీవీ మీద ఆధారపడి ఉన్న రోజులు అవి. అలాంటి రోజుల్లో ఉత్తర భారతదేశం లోని చాలా ప్రసిద్ధ పుణ్యస్థలాలు, మిగతా దర్శనీయ స్థలాలను దర్శించి వాటి గురించి వివరంగా రాయటం అనేది అప్పటికైనా ఇప్పటికైనా అది ఒక అవసరమైన కథనంగానే చెప్పొచ్చు.
ఏది ఏమైనా, ఈ కథనాన్ని చదివిన పాఠకులకు ఖచ్చితంగా ఆయా స్థలాలు చూసిన అనుభూతి కలగడం ఖాయం. వారిలో ఆయా స్థలాలను సందర్శించాలన్న కాంక్ష గలగడం కూడా ఖాయం. అలాగే కొత్త స్థలాల గురించి కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారికి కూడా ఈ పుస్తకం ఒక మంచి ఎంపిక అవుతుంది. బహుగ్రంథ కర్త, రచయత్రి దర్భా భాస్కరమ్మ గారి శతజయంతి సందర్భంగా వారి ఈ పుస్తకం పరిచయం చేసే అవకాశం కలగటం సంతోషంగా ఉంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.