కవయిత్రి, రచయిత్రి అనే పదాలకు అర్థం తెలియని నా పదేళ్ల వయసులో మా పక్క ఇంట్లోనే ఉన్న ఒక అద్భుతమైన మహిళామణి శ్రీమతి దర్భా భాస్కరమ్మగారు. వారి భర్త గారి పేరు పిల్లల పేర్లు తెలిసినా, ఆ రోజుల్లో వారంతా కేరాఫ్ భాస్కరమ్మగారే. బదిలీ దృష్ట్యా వారు నాగార్జునసాగర్, కావలి వెళ్లిపోయినా వారి నాల్గవ అమ్మాయి నా స్నేహితురాలు సుభాషిణి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది.
కాలక్రమేణా ధర్భా భాస్కరమ్మ గారు మంచి కవయిత్రి అని నాకు తెలిసింది. కానీ అప్పుడు ఆ రచనలేమి నేను చదవలేదు. ఏవో సాంప్రదాయకమైన కాలక్షేప పద్యాలు కాబోలు అని భావించడం నా తప్పు కాదు. ప్రచారం కోరుకోని ఆమె, ఆ కుటుంబ సభ్యుల నిరాడంబరతే. ఇటీవల సుహాసిని (నాటి లక్ష్మీకాంతం) తమ తల్లిగారైన ధర్భా భాస్కరమ్మ గారి నవల మరియు కొన్ని కథలు పంపించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇంతటి విదుషీమణి ఆ రోజుల్లో – దాదాపు 60 ఏళ్ల క్రితం గుంటూరులో ఉన్నారని మేము ఊహించలేదు. నా దృష్టిలో ఆవిడకి రావాల్సిన అంత కీర్తి ప్రతిష్టలు రాలేదనే అనుకుంటున్నాను.
ముఖ్యంగా “పునర్నవం” అనే నవల రచనా విధానం, అందమైన శైలి, స్త్రీలు వ్యక్తిత్వంతో ఉండాలని ఆరోజుల్లోనే ఆవిడ చెప్పిన విధానం అద్భుతం. సాంప్రదాయక పద్యాలు వ్రాసి పండితుల మెప్పు పొందిన భాస్కరమ్మ గారు ఇటువంటి సామాజిక ప్రధానమైన నవల రాసారా, ముఖ్యంగా అభ్యుదయ భావాలు తోటి తన కాలం కంటే దాదాపు 40 సంవత్సరాల ముందు పరిస్థితులను ఊహించి రాశారా అని అబ్బురంగా అనిపించింది. సరళమైన శైలిలో, చక్కని సంభాషణలతో ఈనాటి రచయితలు రాసిన విధంగా ఆనాడే వ్రాయటం చాలా గొప్ప విషయం. ఇందులోని సుమతి పాత్ర చాలా విలక్షణమైనది. ఆదర్శవంతమైనది. తన బావ సుధాకర్ (సుధా) అంటే ఆమెకి చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం, ఈ ప్రేమ ‘శారీరక సంబంధమైన’ లేదా ‘పెళ్లి’ అనే వరుసలో కాదు. అద్భుతమైనటువంటి స్నేహబంధం వారిద్దరిది. సుమతికి పెళ్లి అయింది. అనుకూలవంతుడైన ఆమె భర్తకి కూడా సుధా అంటే వాత్సల్యం.
సుధ డిఫెన్స్ సర్వీసెస్‌లో చేరటానికి విశాఖపట్నం వెళ్ళిపోతాడు. అతని క్షేమం కోసం సుమతి ఎంతో ఆరాటపడుతుంది. అతను అప్పుడప్పుడు సుమతికి ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాడు. సైన్యంలో జరిగే అనేక విశేషాలు, యుద్ధ తీవ్రతలు చదువుతూ ఉంటే సుమతి కంగారుపడినా, ఆ విధంగానైనా అతని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటుందామె.
భాస్కరమ్మ గారి భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయటం వల్ల కొన్ని సాంకేతికమైన విషయాలను, పదాలను (టెక్నికల్ టర్మ్స్) అలవోకగా ప్రయోగించారు రచయిత్రి. సాధారణ పౌరులకు తెలియని డిఫెన్స్ విషయాలను అక్కడ ఉండే హోదాలు, క్రమశిక్షణ, జీవన క్రమము వివరించారు. “ఎవరైనా గడ్డం చేసుకోకుండా వచ్చాడో, ఎవడి చొక్కానైనా గుండీలు లూజుగా ఉన్నా, బూట్లు బకెల్సు నిగనిగలాడేలా పాలిష్ చేయకపోయినా తక్షణం పనిష్మెంట్ ఇచ్చేవారు. క్రమం తప్పకుండా డ్రెస్ వేసుకొని పెరేడ్‌కి వెళ్లడం, తర్వాత ఎవరి టెంట్‌కి వాళ్ళు వెళ్ళటం, రొట్టె, టీ తీసుకుని రేడియో దగ్గర కూర్చోవడం… ఇవన్నీ ఆనాడు మరింత స్ట్రిక్ట్ గా ఉండేవి. వారిలో ఎక్కువమంది ఉత్తర భారతదేశ (హిందీ) వాసులు కాబట్టి వారు హిందీ పాటలు రేడియోలో వినడం, దక్షిణ భారతీయులు మద్రాసు రేడియో కేంద్రంలో పాటలు వినాలని కుతూహల పడడం వంటి చిన్న చిన్న వివరాలు కూడా వ్రాసారామె. ఆర్మీ వారికే ఉండే ప్రత్యేకమైన పత్రికలో ఈ నవల ప్రచురింపబడింది. “పర్షియా ఎడారిలో ఉండగా ఒకరోజు ఇసుక తుఫాను ఆకాశం వరకు లేచింది. ఆ ఇసుక తుఫాను గాలి ముఖాన్ని కొడుతుంటే చీమలు, నల్లులు కరిచినట్లు బాధపెట్టింది. గాలి తుఫాన్ రేగ్గానే చెవుల్లో దూది పెట్టుకుని, సన్నని దోమ తెరవంటే గుడ్డ మెడమించి ముఖం మీదకి తొడుక్కొని కళ్ళకు గాగల్స్ పెట్టుకున్నాము. ఆ ఇసుక కంఠంలో ఎలాగో దూరి, నోరు ఇగిరి నాలుక పిడచకట్టింది. చుట్టూ ఇసుక తప్ప ఏమీ కనబడటం లేదు…” ఒక రచయిత్రి ఆర్మీలో సైనికులు పడే కష్టాలను ఇంత వివరంగా రాయటం మరే నవలలను నేను చూడలేదు.
సుమతి పెళ్లికి సెలవు పెట్టి వచ్చాడు సుధా. చివరి వరకూ అతని పెళ్లి కొరకు, అతని జీవితం సక్రమంగా సాగడం కొరకు ఎంతో తాపత్రయపడుతుంది సుమతి. వారిద్దరి మధ్య ఉన్న “ప్లాటానిక్ లవ” (అది స్పష్టంగా చెప్పకపోయినా) ని ఎంతో ఉదాత్తంగా చిత్రించారు భాస్కరమ్మ. అప్పుడప్పుడే వస్తున్న రచయిత్రుల నవలల్లో ఉండే సాధారణమైనటువంటి కుటుంబాల వంటింటి సమస్యలు కాకుండా – ఆర్మీ సిపాయిల విషయాలతోపాటు స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన పవిత్రమైన అనుబంధాలను చెప్పటం చాలా గొప్ప విషయం. ఊహలోక విహారము, ప్రేమ సంభాషణలు లేని సీరియస్ నవల పునర్నవం.
మధ్యతరగతి కుటుంబాలలోని భావాలు, సమస్యలు, వేదనలు నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశారు భాస్కరమ్మ. సుమతి సుధాకర్‌ని అమలతో పెళ్లికి ఒప్పిస్తుంది. పెళ్లి అయిన తర్వాత సుధ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఉత్తరం సుమతికి వ్రాస్తాడు. దాంట్లోనే అమలకి కూడా వ్రాశాడు. ఇలా సుధా సుమతుల స్నేహబంధం తెలియజేసే సంఘటనలు చాలా ఉన్నాయి. అమల గర్భవతి అవుతుంది. విషయం తెలిసిన సుధ ఆనందిస్తాడు. కానీ పెళ్లయి పదేళ్లకైనా సుమతికి సంతానం కలగకపోవడంతో చుట్టాలు పక్కాలు ఆమె మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుంటే భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది సుమతి. అందరూ కలిసి భర్తకి మరో పెళ్లి చేస్తారు… వారికి పిల్లలు పుడతారు… వారు సుఖంగా ఉండనీ.. అని తాను ఒక సన్యాసినిలా బ్రతుకుతూ ఉంటుంది.
భార్యను చూడటానికి వచ్చిన సుధకి సుమతి ఇల్లు విడిచి వెళ్లిందని తెలిసి తల్లడిల్లిపోతాడు. తన జీవితమంతా సుమతిని వెతికే ప్రయత్నంలోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అమలకు పాప జన్మిస్తుంది. అయితే అనూహ్యంగా హరిద్వార్‌లో కాషాయ వస్త్రధారిణి అయిన సుమతిని గుర్తించిన సుధ ఆమెను తీసుకొని ఇంటికి రావడంతో నవల సుఖాంతం అవుతుంది. ఈ నవలలో ధర్భా భాస్కరమ్మ గారి ప్రతిభ – సైనికుల జీవితాన్ని వర్ణించటం ఒకటైతే, బావా మరదళ్ళ వరస అయినా కూడా వారి మధ్య చక్కని స్నేహ వాతావరణన్ని, అనుబంధాన్ని సృష్టించటం మరింత అభ్యుదయ పంధాలో నడిచింది. నవల మాత్రమే కాక ఆమె ఎన్నో కథలు, నృత్య రూపకాలు, నాటికలు రచించారు. ఆమె రచించిన కవిత్వం అయితే మహా పండితుల అభినందనలు పొందాయి. వారి కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లి ఎన్నో ఊర్లలో నివాసంగా మార్చుకున్నా దర్బా భాస్కరమ్మ గారు మాత్రం మా గుంటూరు కవయిత్రిగా, రచయిత్రిగా మేము ఓన్ చేసుకోవడం మా భాగ్యంగా తలుస్తాను. ఒక నవలను చదవటం, ఆ నవలపై విశ్లేషణ చేయడం అలవాటైన విషయమే అయినా – పునర్నవం నవల నాకు ఒక ప్రత్యేకమైనదిగా తోచింది. నా చిన్నతనంలో నిత్యం చూసిన ఒక సాధారణమైన గృహిణి, భర్త, పిల్లలు, వంట, పిల్లల పెంపకం – ముఖ్యంగా భర్త డిఫెన్స్ సర్వీసెస్‌లో తరచూ బదిలీలతో తిరుగుతూ, అప్పుడప్పుడు ఇంటికి వస్తున్న విషమ పరిస్థితుల్లోనూ, కుటుంబాన్ని అంతా తన ఒక్క చేతి మీదగా లాక్కొచ్చిన ఒక మామూలు మహిళ – ఇంత గొప్ప కవయిత్రి, రచయిత్రి అని తెలియటం అద్భుతంగా ఉంది. ఆమె స్వరూపం ఇంకా నా కళ్ళముందే మెదులుతోంది. మనసారా గౌరవంగా ఆమెకి నమస్కారాలు అర్పించుకుంటున్నాను. ఆమె రచనలు అన్నిటిని అచ్చులోకి తీసుకురావాలని ఎన్నాళ్ళ నుండో కృషి చేస్తున్న డి.ఎల్. సుహాసినికి హృదయపూర్వక అభినందనలు.
