వ్యవసాయక సంక్షోభంతో పోరాటం చేస్తున్న మహిళా రైతులు ఎదుర్కొన్న సాగుబడి సవాళ్లు
పెట్టుబడిగా పెట్టిన శ్రమతో పోలిస్తే ప్రత్యేక రాబడి అతి తక్కువగా వస్తున్నప్పటికీ, మహిళా రైతులు తమ పొలాలను ఎందుకు సాగు చేస్తూనే ఉంటారని అడిగినప్పుడు, వాళ్లు వెంటనే “కనీసం మా కుటుంబానికి తిండి గింజలు లభిస్తాయి కదా”, అని సమాధానం ఇస్తారు.
రాష్ట్రాల వ్యాప్తంగా సాధారణంగా వ్యక్తం అయ్యే ఈ భావన, మహిళలు అన్నింటి కంటే ముఖ్యంగా తమ కుటుంబాలకు ఆహారాన్ని చేకూర్చడానికి ఎలా ప్రాధాన్యమిస్తారో ఎత్తిచూపుతుంది. “ఇది తప్ప చేయడానికి ఇంకేమీ లేదు” అంటూ వారు తమ నిస్సహాయతను అనివార్యతను వెల్లడిస్తారు.
వాస్తవికత, వ్యవహార జ్ఞానం, రాబోయే ప్రమాదాల గురించి ముందుగానే తెలుసుకునే వైఖరితో మహిళలు తమ పొలాలను సాగు చేయడమే కాకుండా, తమ కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించడం, అప్పులు తిరిగి చెల్లించటం, తమ భూమిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు తమ కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా వారి ప్రయాణం సులభమైనదైతే కాదు. అది వ్యవసాయం చేసేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు, పురుషాధిక్య సమాజంలో మహిళలుగా వారు ఎదుర్కొంటున్న అదనపు పోరాటాల ద్వారా రూపుదిద్దుకుంది. ప్రారంభంలో, మహిళా రైతులు వారికి అందుబాటులో ఉన్న కొద్దిపాటి అవకాశాలకే పరిమితం చేయబడ్డారు. వారు కూడా అదే మార్కెట్ ఆధారిత వ్యవసాయ వ్యవస్థలోనే పనిచేయవలసి వస్తోంది, తరచుగా విత్తనాల, ఎరువుల లాబీలు అభివృద్ధి చేసే వాణిజ్య పంటల నుండే ఎంచుకోవలసి ఉంటుంది. వాణిజ్య పంటల కంటే ఆహార ధాన్యాలకు ప్రాధాన్యం ఇచ్చేలా వారు నిరంతరం భేరసారాలు జరపాల్సి వస్తోంది.
ఆర్థిక వనరులను నిర్వహించడం మరో ముఖ్యమైన సవాలు. ఒక మహిళ వివరించినట్టుగా, “భూమిని సాగు చేయాలంటే మీరు అప్పు చేయాల్సిందే” అయితే, గడువు ముగిసిన బ్యాంకు రుణాలు తరచుగా కొత్త అప్పులు పొందడాన్ని అసాధ్యం చేస్తాయి. అనేక మంది మహిళా రైతులు గ్రామాల్లోని వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ గ్రూపులు, స్వయం సహాయక బృందాలు వంటి అనధికారిక వనరులపై ఆధారపడడం లేదా బంధువుల నుండి అడ్వాన్సులు, అరువులు తీసుకోవడం చేస్తారు. ఎక్కువగా వాళ్ళు పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేస్తుంటారు, అదే సమయంలో తమ తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా వారు అప్పుల వలలో చిక్కుకుంటారు. వ్యవసాయం ప్రధానంగా పురుషాధిక్య రంగం కాబట్టి, మహిళలు కూడా జెండర్ సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటారు. తమ పొలాల్లో ఏ పంట వేయాలనే నిర్ణయాన్ని తరచుగా కుటుంబాలలోని పురుషులే ప్రభావితం చేస్తారు. ఉత్పాదకాలను కొనడానికి, ఉత్పత్తులను అమ్మడానికి మహిళలు మార్కెట్‌కు వెళ్లడాన్ని సామాజిక నిబంధనలు నిరుత్సాహపరుస్తాయి. దాంతో వారు ఈ పనుల కోసం కుటుంబంలోని మగవాళ్ళపై ఆధారపడతారు. ఇలాంటి మద్దతు లేకపోతే, వారు అవసరమైన వనరులను పొందేందుకు, వారి ఉత్పత్తులను విక్రయించడానికి కష్టపడాల్సి ఉంటుంది.
ఒంటరి మహిళలు ఇంకా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. ఒక మహిళ వివరించినట్లుగా, “మేము ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి”. ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున పని చేయించుకునే పురుషులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళలో పొలం దున్నడం, మందులు చల్లడం అంటే పనులు చేయడానికి పెట్టుకునే పురుష కూలీలతో పాటు వడ్డీ వ్యాపారులు, దుకాణదారులు, వాహనాలు నడిపే వారు కూడా ఉంటారు. మహిళా రైతుల పట్ల ప్రత్యేకించి ఒంటరి మహిళల పట్ల, రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ఉంటుంది. వారు అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తున్నప్పటికీ, వారు ఎదుర్కొనే సవాళ్లకు గుర్తింపు చాలా తక్కువ. ఈ సవాళ్లలో వారి పిల్లలు చదువుకోవడానికి తగినంత ఆసరా లేకపోవడం, వ్యవసాయం వారి ఆరోగ్యంపై చూపించే ప్రభావం, కుటుంబ ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వారు చేపట్టక తప్పని అదనపు పనులన్నీ ఉన్నాయి. పరిపాలన నిర్లక్ష్యం ఉదాసీనత గాయానికి అవమానాన్ని జోడిస్తాయి.
అపారమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఎలాంటి అర్దమంతమైన ఆసరా లేకపోయినా, తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉన్న మహిళా రైతుల స్థితిస్థాపకతను ఈ వ్యాసం ప్రముఖంగా ఎత్తిచూపుతుంది.
(భవిష్యత్తును అభివృద్ధి చేసుకుంటూ… మహిళా రైతుల గురించి ఫోటో వ్యాసాలు పుస్తకం నుండి..)
