మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళతో… అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన ఒక ఉత్తరం కనిపించింది. ఛాయాదేవి గారి కుదురైన చేరాత చూస్తూ కాసేపు ముచ్చటపడి, పుస్తకాలు సర్దుకోవడం అయిపోయాక ఇవాళ సాయంత్రం తీరిగ్గా ప్రశాంతంగా చూద్దామని టేబుల్ మీద పెట్టుకున్నాను. సాయంత్రం కొంతమంది తెలుగు మిత్రులతో మా ఊళ్ళోని షూకిల్ నదీతీరానికి నడక ప్లస్ డిన్నర్ కార్యక్రమం ముగించుకుని, తిరిగి వస్తున్నప్పుడు కొండవీటి సత్యవతి గారి ఫేస్‌బుక్ మెసేజ్… ఛాయాదేవి గారు ఇక లేరని! ఇవాళ పొద్దున్న లేవగానే చూసిన / తారసపడిన కుదురైన అక్షరాల సమూహం ఒక్కసారిగా చెరిగిపోయినట్టుగా అనిపించింది. ఇంటికి వచ్చాక ఛాయాదేవి గారి ఉత్తరం చదువుతూ ఉంటే, ఆ అక్షరాల వెనుక ఆమె అందమైన, ఆహ్లాదమైన వ్యక్తిత్వం కనిపిస్తూ ఉంది.
ఛాయాదేవి గారితో ముఖాముఖి పరిచయం ముప్ఫయ్యేళ్ళ పైనే.. పరోక్ష పరిచయం ఇంకో అయిదేళ్ళు వెనక్కి… అంటే, దరిదాపు ఆమె పేరు నా ఆలోచనల్లోకి అడుగుపెట్టి ముప్ఫై అయిదేళ్ళు.
డిగ్రీ చదివే రోజుల్లో కవిత్వం చదవడం అనే జ్వరం బాగా వేడెక్కినప్పుడు ఆశ్చర్యంగా చేతికందిన అందమైన పుస్తకాల్లో ”కవిత” ఒకటి. కవిత్వ పుస్తకాలు. ఆ మాటకొస్తే ఏ పుస్తకమైనా అయితే, 1/8 డెమ్మీ లేదా, 1/4 డెమ్మీ, లేదా క్రౌన్ సైజులో మాత్రమే కనిపించే లెటర్ ప్రెస్ యుగం అది. ఆ మూడింటికి భిన్నమైన సైజులో ‘కవిత’. దాన్ని ‘అన్‌సైజ్’ అనేవాళ్ళం. అది మొదటి ఆశ్చర్యమైతే, రెండోది – అసలు కేవలం కవిత్వానికి మాత్రమే పరిమితమైన ఒక ప్రత్యేక సంచికని చూడడం గొప్ప ఆనందం. అన్నింటికంటే పెద్ద ఆశ్చర్యం – మహిళా ఎడిటర్ నిర్వహణ! అంటే అబ్బూరి ఛాయాదేవి గారి సంపాదకత్వం.
ఏడాదికి మూడుసార్లు రావలసిన ‘కవిత’ రెండు సంచికల దగ్గరే ఆగిపోయిందని తర్వాత విన్నాను. నా దగ్గర ఒకటి ఎలాగూ
ఉంది కాబట్టి, రెండోది కూడా దొరకపుచ్చుకోవాలని ఆ సమయంలో చాలా ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన లైబ్రరీలన్నీ గాలించాను. ఖమ్మం నుంచి బెజవాడ టాగోర్ లైబ్రరీ దాకా – ఇంకా నాకు అందుబాటులో ఉన్న వ్యక్తిగత లైబ్రరీలు… వేగుంట మోహన ప్రసాద్, హీరాలాల్ మోరియా, నండూరి రామ్మోహనరావు గారు, టిఎల్ కాంతారావు గారి మొదలుకొని హైదరాబాద్ దాకా…
అప్పటికి నాకు ఛాయాదేవిగారు తెలీదు. పూర్తిగా కొత్త వ్యక్తులతో స్నేహహస్తం చాచే కలుపుగోలుతనం లేదు. కానీ, జీవితం అనేది దానికదే విచిత్రమైంది కాబట్టి… ఆరుద్రగారు హైదరాబాద్ వస్తూ, ”నువ్వొస్తే మనం కొంతమందిని కలుద్దాం” అని ఆయనే నండూరిగారికి చెప్పి నాకు మూడు రోజుల సెలవు ఇప్పించారు. అవి నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఆరుద్రగారు 1975 తర్వాతి కవిత్వాన్ని సంకలనం చేసే బాధ్యత తీసుకున్నారు. దానికి నన్ను సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆరుద్రగారు ఇటు బెజవాడ, అటు హైదరాబాద్ వచ్చినపుడల్లా ఆయనే నండూరి గారికి చెప్పి ”అఫ్సర్‌ని నేను కిడ్నాప్ చేస్తున్నా” అని తన వెంట తీసుకువెళ్తున్న రోజులవి. అట్లా హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి ఛాయాదేవి గారిని కలిశాను.
కలవగానే ఆమె అన్న మొదటి వాక్యం… ‘అఫ్సర్ కదా! ఆ పేరు నాకిష్టం. మా కాపురం మొదలుపెట్టిన మొదటి ఇంటిపేరు అఫ్సర్ మంజిల్’ అన్నారు చాలా సంతోషపడిపోయి. అది చిన్న సంతోషమే కావచ్చు కానీ, ఆ సంతోషం ఆమెని చాలా గతంలోకి లాక్కువెళ్ళింది. అప్పటి హైదరాబాద్, హిమాయత్‌నగర్… అవన్నీ ఆమె నెమరు వేసుకుంటూ, మధ్యలో ”కవిత” గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకు కావలసిన అసలైన సమాచారం దొరకడం మొదలుపెట్టింది.
”కవిత” మొదలైంది 1954లో. ఆధునికత అనే భావనకి ఒక ఆకారమేదో ఏర్పడుతున్న కాలం అది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా సాహిత్య వాతావరణంలో కొత్త మార్పు వస్తోంది తెలుగు భాషకి సొంత అస్తిత్వం కావాలనే కాంక్షతో పాటు కాస్మోపాలిటన్ సంస్కృతి వల్ల హైదరాబాద్ హైబ్రీడ్ సాహిత్య ప్రయోగాలకు అది తొలి దశ. ఒకవైపు ”కవిత” సంచికల మీద వివాదం మొదలయింది. ఆ కవిత్వంలోని ఆధునికత, ప్రయోగ ధోరణి మీద ప్రధాన స్రవంతి పత్రికలన్నీ కరవాలాలు దూస్తున్నాయి. ఆ ప్రయోగంలో దేశీయత లేదన్నది ప్రధానమైన విమర్శ. దానికి ధీటుగా ”తెలుగు స్వతంత్ర”లో శ్రీశ్రీ సమాధాన అస్త్రం. ఇట్లాంటి ప్రయోగాలు వచ్చి తీరాల్సిందేనని మొండి సమాధానం. అట్లాంటి వాతావరణంలో కవిత్వంలో మాత్రమే ఉండకుండా, వచనం వైపు మళ్ళారు ఛాయాదేవి. ఆ తరువాత అదే ”తన మార్గం”గా ఆమె ప్రకటించుకోలేదు కానీ, అంతకంటే ఎక్కువ ఏకాగ్రతతో రచనా వ్యాసంగం కొనసాగించారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం ఒక్కసారిగా పెల్లుబికిన ఉద్యమం కాదు. అనేక దశల్ని దాటుకుంటూ 1985 తర్వాత స్థిరపడిన అస్తిత్వ ఉద్యమం అది. భారతీయ సాంస్కృతిక రాజకీయ జీవితంలోthe long 50s గా భావించే యాభైల గురించి మనకింకా సరైన పరిశోధన కానీ, చరిత్ర నిర్మాణం గానీ జరగలేదు. ఆ పరిశోధన సాధ్యపడి, ఆ దశకానికి సంబంధించిన సాహిత్య ఆకరాలు దొరికితే తప్ప తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం సాధ్యపడదు. ఆ దశకంలో ఛాయాదేవి గారి వంటి రచయిత్రులు చేసిన కృషి కూడా వెలుగులోకి రాలేదు. అయితే, ఛాయాదేవి గారు ఆ దశలో రాసిన కథల్లోనే నగర జీవితం ఎక్కువగా కనిపించడానికి, హైదరాబాదీ సాంస్కృతిక వెలుగు నీడల్లో వరద రాజేశ్వరరావుగారూ ఆమె కలిసి నడిచిన అడుగుల ప్రభావం చాలా ఉందని మాత్రమే ఇప్పటికి నేను చెప్పగలను. ఇక్కడ కూడా నన్ను బాగా ఆకట్టుకున్న విషయమేమిటంటే – రాజేశ్వరరావు గారి దారికి భిన్నంగా ఛాయాదేవి గారు తనదైన మార్గాన్ని discover చేసుకోవడం. తన దారి మీద తనదైన గొప్ప నమ్మకంతో ముందుకు కొనసాగడం- ఆ విధంగా ఆమె రెండు రకాల hegemony ని సూక్ష్మంగా ప్రశ్నిస్తూ ముందడుగు వేశారని నాకు అనిపిస్తుంది.
ఆరుద్రగారి వల్ల ముందే పరిచయమైనా, నేను ఇంకో రెండు మూడడుగులు ముందుకేసి, ఆమె స్నేహ హస్తాన్ని అందుకున్నది మాత్రం 1992 తరువాతనే! అదే సంవత్సరం నా కవితా సంపుటి ”ఇవాళ”కి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు దక్కింది. అప్పట్లో మా తరానికి ఆ అవార్డు ఫ్రంట్ రాంక్ సత్కారమే! హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో అవార్డు ప్రదానం జరిగింది. ఆ సభకి సిరి చుక్కల్లాగా మొదట వచ్చిన వారిలో ఛాయాదేవి గారు ఒకరు. ”అఫ్సర్‌కి మంజిల్ దొరికింది.”! అన్నారామె మనస్ఫూర్తిగా అభినందిస్తూ. ఆ మర్నాడు వాళ్ళ ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి పిలవడం వల్ల మరిన్ని కబుర్లు చెప్పుకునే అవకాశం దొరికింది. అదే సమయంలో నా రీడింగ్ జర్నీలో మరో అద్భుతం పరిచయం జరుగుతూ ఉంది. అది అబ్బూరి రామకృష్ణా రావు గారి ”ఊహా గానం మరి కొన్ని కృతులు” అనే మరో అందమైన పుస్తకం. ఎర్రట్ట పుస్తకం మీద బంగారు రంగు అక్షరాల ఎంబోజింగ్‌తో వచ్చింది ఆ పుస్తకం. చేతిలో పట్టుకుంటే దానికదే అలంకారంగా ఉండేది.
ఈ రెండో కలయికలో కబుర్లన్నీ ఎక్కువగా అటే మళ్లాయి. అయితే, అవి మనకున్న మరో నగరం విశాఖపట్నం చుట్టూ తిరిగిన విషయాలు. అభ్యుదయ ఉద్యమం, అందులో అబ్బూరి వారి పాత్రా… ఇలా అనేక గత జ్ఞాపకాల సంచారం.
నాకు గుర్తున్నంత మేరకు ఛాయాదేవి గారి దృష్టి, ఆమె అనుభవాల బలమంతా హైదరాబాద్ జీవితం నించి వచ్చిందే. ఆ రోజు చెప్పిన విషయాల్లో నాకు ఆమె విశాఖ-హైదరాబాద్‌లు ఏ రకంగా భిన్నమైన ప్రభావాల్లో ఎక్కువగా చెప్తూ వచ్చారు. బహుశా, ఆ భిన్నత్వం అర్థమైంది కాబట్టే ఆమె అయిదు నక్షత్రాల ఆసుపత్రుల కార్పొరేట్ మార్కెట్ గురించి కథ రాయగలిగారు. నాకు తెలిసి, ఆ రకమైన కార్పొరేట్ జీవన విధానం సాహిత్యంలోకి తీసుకువచ్చిన తొలి రచన ఆమెదే కావచ్చు. అయితే, ఆ కథకంటే ముందే ఛాయాదేవి గారు రాస్తూ వచ్చిన కథల్లో హైదరాబాదీ మధ్య తరగతి మహిళ చాలా బలమైన subjectivity తో కనిపించడం మొదలుపెట్టింది. ఆ కోణాన్ని ప్రోటో-ఫెమినిస్టు దృక్పథం నించి గమనిస్తే, ఆమె సృష్టించిన స్త్రీపాత్రలన్నీ స్వయం వ్యక్తిత్వంతో అందంగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి.
ఛాయాదేవి గారిని 1992 తర్వాత ఎన్నిసార్లు కలిశానో నాకు గుర్తులేదు. కానీ, మరో మరచిపోలేని సందర్భం నేను మాడిసన్ విస్కాన్సిన్ వచ్చేముందు చేకూరి రామారావు గారితో కలిసి వాళ్ళింటికి వెళ్ళాం.
ఆ సమయంలో మాడిసస్ వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో విపరీతంగా నలిగిపోతున్నప్పుడు, ”లేదు, వెళ్ళాల్సిందే!” అని ఖరాఖండిగా చెప్పి, ఎందుకు వెళ్ళాలో సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నంలో చేరాగారు నన్ను వాళ్ళింటికి లాక్కువెళ్ళారు. వరద రాజేశ్వరరావు గారు కొన్నాళ్ళు మాడిసన్‌లో పాఠాలు చెప్పారు, చేరాగారు మాడిసన్ వెళ్ళడానికి అటూ ఇటూగా. మాడిసన్ జీవితంలోని మాధుర్యం గురించి వాళ్ళిద్దరూ కథలు కథలుగా ఆ రోజు చెప్పుకుంటూ వెళ్ళడం ఇప్పటికీ గుర్తుంది. మాడిసన్ రావడానికి ముందు నన్నూ, కల్పననీ భోజనాలకు పిలిచిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కల్పన నవల ‘తన్హాయీ’ వెలువడినప్పుడు ఆ నవలకి మనస్ఫూర్తిగా స్వాగతమిస్తూ విపులమైన సమీక్ష రాశారు ఛాయాదేవి గారు. నిజానికి ఆ సమీక్ష ఆమె రాశారని తెలీదు. ఆ సమీక్ష అచ్చయ్యాక ఎవరో చెప్తే, తెప్పించుకుని చదివి మేమే మళ్ళీ ఫోన్ చేశాం, ఆస్టిన్‌లో ఉండగా.
ఆమెని దగ్గరగా చూసిన వాళ్ళకి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి – ఆమెలోని నిలకడ, రెండు – జీవితం ఎలాంటి చేదు అనుభవాలిచ్చినా, తను మాత్రం స్నేహమో, ప్రేమో తిరిగివ్వడం. ఆమె వ్యక్తిగత, సాహిత్య జీవితాల్లో గొప్ప నిగ్రహమూ, విశ్వాసంతో నిండిన నిలకడ ఉంది. ఆమె మొదటి కథ నుంచి తాజా రచన దాకా ఆమెలోని కుదురైన బతుకు ఇరుసు చెక్కుచెదరలేదు.
ఛాయాదేవి గారు ఎక్కడున్నా తనున్న చోటుని ఆహ్లాదంగా, అందంగా, నిరాడంబరమైన aesthetic beauty తో నింపుకుంటారు. అవి పుస్తకాలా, చిత్రాలా, తనదే అయిన స్వచ్ఛమైన జూతీవరవఅషవ… వీటిల్లో ఆ అందం దేనిదో చెప్పడం కష్టమే! బహుశా, వాటన్నింటికంటే ఎక్కువగా ఆ చల్లనైన చిరునవ్వు కావచ్చు. స్నేహితుల పట్ల తనకున్న నిండైన ప్రేమభావమంతా వ్యక్తమయ్యే తన కదలిక కావచ్చు.
కాలంతో పాటు మారే శక్తి అంత తేలికేమీ కాదు. పైగా, కొన్ని తరాల చరిత్రని చూస్తూ, చూస్తూ కాలంతో పాటు వచ్చే ప్రతి కదలికని తన మార్గంలో కలుపుకుంటూ వెళ్ళడం ఇంకా కష్టం. ఛాయాదేవి గారి జీవితం నేర్పే పెద్ద పాఠం అదే అనుకుంటాను.
(సారంగ వెబ్ మ్యాగజైన్ సౌజన్యంతో)