విలువల గోడలు కూలిపోకుండా
సహన సానుభూతుల సౌధాలు
పడిపోకుండా నిలబెట్టిన
జగజ్జెట్టీ ఆమె…!
నిజాయితీ నిర్భీతి స్వభావమైన
సాహస సమరశీలమా పయనం
నిలువెత్తు నైతిక శక్తి!
నిత్య చిరునవ్వుల లోకయుక్తి!
తనింటి పేరు కడప!
మానవ హక్కుల మశాల్ జయక్క!
నిరంతరం పోటెత్తే సముద్రమై
బాధలగాధలను తడిమిన
కార్యాచరణ బాటసారి!
కడు క్రూర సమాజాన్ని తన
ఉనికితో సవాల్ చేసిన ధీశాలి!
అకృత్యాల పట్ల ఆమెది
అలుపెరుగని నిరసనోద్యమం
సమహక్కులకై ఆమె మమేకం!
మానవత్వం ఆమె చలనం
మనిషిగా ఆమె మహోన్నతం…!
పీడిత తాడిత జన సమూహాలు
తన అశేష బంధువర్గాలు
ఆమె దినచర్యలు అన్నార్తుల
జనజీవన సంవేదనలు…
ఎల్లవేళలా ప్రొద్దుటూరులో
పొడిచే చైతన్యాల పొద్దు
నీడలా జాడ చూపుతూ
ఆమె నడిచిన దారులలో
అప్పుడూ ఇప్పుడూ
తొవ్వ పువ్వు ఆమే!
దారి దీపం ఆమే!